తెలంగాణలో చీప్.. ఔట్‌లెట్స్!
ఒక్కవేటుకు రెండు పిట్టలు. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు రూపొందించిన సరికొత్త మద్యం పాలసీ ఈ సామెతను గుర్తుకు తెస్తుంది. అటు గుడుంబా, ఇటు బెల్ట్ షాపులను అరికట్టడంతోపాటు, ఖజానాకు భారీగా కాసుల కురిపించే కొత్త మద్యం పాలసీని అధికారులు రూపొందించారు. కొత్త పాలసీ తెలంగాణలో పెద్ద పండుగ దసరాముందు ప్రారంభం కాబోతుంది. ఇది అమల్లోకి వస్తే ఊరూరా రేషన్ షాపుల కంటే మద్యం షాపుల సంఖ్యే అధికంగా ఉండబోతుంది. గతంలో దొంగచాటుగా గుడుంబా అమ్మిన బెల్ట్ షాపుల్లో కూడా ఇకనుంచి సర్కారీ మద్యం అధికారికంగా అందుబాటులోకి రాబోతోంది. అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతున్న కొత్త మద్యం పాలసీ ప్రస్తుతం సిఎం పరిశీలనలో ఉంది. ఈనెల రెండోవారంలో అధికారికంగా కొత్త పాలసీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.
కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఊరూరా సర్కారీ మద్యం ఏరులై పారబోతున్నప్పటికీ, గుడుంబా, బెల్ట్ షాపులను అరికట్టడానికి ఇంతకంటే ప్రత్యామ్నాయం లేదన్నది ఎక్సైజ్ అధికారుల వాదన. గుడుంబా మహామ్మరిని పారదోలే విధంగా కొత్త ఎక్సైజ్ విధానం ఉండాలని సిఎం కెసిఆర్ చేసిన సూచన నూటికి నూరుశాతం నెరవేరబోతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీతో ఊరూరా సర్కారీ మద్యం ఏరులై పారే అవకాశం ఉన్నప్పటికీ, గుడుంబా, బెల్ట్ షాపులు మాత్రం పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. పైగా కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.2 వేల నుంచి 3వేల వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్‌ల ఫీజుల రూపేణా సుమారు రూ.4000 కోట్ల ఆదాయంరాగా, కొత్త మద్యం పాలసీతో ఈ మొత్తం ఒక తెలంగాణ నుంచే సమకూరబోతుందని అధికారులు లెక్కగట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2200 మద్యం షాపులు అధికారికంగా నోటిఫై అయివున్నాయి. వీటిలో 1980 మద్యం షాపులు మనుగడలో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ నగరంలోని 240 మద్యం షాపులను మినహాయిస్తే మిగతా షాపులన్నీ మండల, గ్రామీణ, పట్టణాల్లోనే ఉన్నాయి. వీటిలో 80శాతం షాపులు 10వేల నుంచి 50వేల జనాభా కలిగిన చోట ఉన్నాయి. ఒక్కో మండలంలో సుమారు రెండునుంచి మూడు మద్యం షాపులు ఉండగా, ఒక్కో షాపు నుంచి లైసెన్స్‌ల ఫీజు రూపేణ రూ.34 లక్షల చొప్పున కోటి చిలుకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఒక్కో మద్యం షాపు కింద అనధికారికంగా 10నుంచి 15 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు మొత్తం దాదాపు బెల్ట్ షాపుల్లో జరిగే మద్యం వ్యాపారం నుంచే వస్తుందని అంచనా. బెల్ట్ షాపులకు అధికారికంగా లైసెన్స్‌లు జారీ చేయడంతోపాటు చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజుల రూపేణ అదనపు ఆదాయం, అలాగే గ్రామాల్లో జరుగుతున్న గుడుంబా వ్యాపారాన్ని అరికట్డడం సాధ్యమవుతుందని కొత్త మద్యం పాలసీలో అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మండలానికి రెండు, మూడు మద్యం షాపులు ఉండగా, ఇకనుంచి మండలం మొత్తానికి ఒకే లైసెన్స్ జారీ చేసి దానికి రూ.కోటి యాభై లక్షలుగా లైసెన్స్ ఫీజు ఖరారు చేయాలని కొత్త విధానంలో అధికారులు సూచించారు. దీంతో గతంలో మండలానికి కోటి రూపాయలు వచ్చిన ఆదాయం కోటిన్నరకు పెరుగుతుందని అధికారులు అంచన వేశారు. ఒకే లైసెన్స్‌దారు అంత మొత్తాన్ని చెల్లించడం భారంకాకుండా బెల్ట్ షాపులకు ‘రిటైల్ ఔట్‌లెట్స్’కు లైసెన్స్‌లు జారీ చేసే అధికారాన్ని మండలంలో లైసెన్స్‌దారునికే కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల మండలం మొత్తం మద్యం వ్యాపారం ఒకరి చేతిలోకే వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల నియోజకవర్గం, జిల్లా మొత్తం మద్యం వ్యాపారాన్ని మద్యం సిండికేట్లు చేజిక్కించుకునే అవకాశం ఉందని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
సౌజన్యం : ఆంద్రబూమి
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








